At Last Minute Donald Trump calls off attack on Iran in Telugu

665 total views, 1 views today

ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు

ఆ తర్వాత దాడులను విరమించుకున్న ట్రంప్

అమెరికా-ఇరాన్‌ మధ్య క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా క్షిపణి దాడులకు సిద్ధపడి చివరిక్షణంలో నిర్ణయాన్ని  ఉపసంహరించుకుంది. ఆకాశంలోకి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. ట్రంప్‌ ఇప్పుడు వద్దులే అనడంతో వెనక్కు తిరిగి వచ్చాయి. ఇరాన్‌ అణు కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఉద్దేశించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన నాటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. ఇటీవల ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. గల్ఫ్‌ ప్రాంతంలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి జరిగింది. దీనికి ఇరానే కారణమంటూ అమెరికా ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల నడుమ అమెరికా నౌకాదళానికి చెందిన ఆర్‌క్యూ-4 గ్లోబల్‌ హాక్‌ డ్రోన్‌ను ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌ దళం ఒక క్షిపణితో గురువారం కూల్చివేసింది. సదరు లోహ విహంగం తమ గగనతలంలోకి చొరబడిందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. ఈ వాదనను అమెరికా ఖండించింది. కూల్చివేత సమయానికి తమ డ్రోన్‌ ఇరాన్‌కు 34 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఇది చాలా ఖరీదైన డ్రోన్‌. ఒక్కోటి 12 కోట్ల డాలర్లు పలుకుతోంది. డ్రోన్‌ను కూల్చివేసి ఇరాన్‌ చాలా తప్పు చేసిందని ట్రంప్‌ అదే రోజు వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్‌పై క్షిపణితో దాడి చేయాలని అమెరికా నిర్ణయించిందని, ఆ తర్వాత దాన్ని విరమించుకుందని ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది. ట్రంప్‌ కూడా ఈ కథనాన్ని ధ్రువీకరించారు. ‘‘దాడికి పది నిమిషాల ముందు ఆ ప్రయత్నాన్ని నిలిపివేశాను. ఆ దాడి వల్ల ఎంత మంది చనిపోతారని అడిగా. 150 మంది ప్రాణాలు కోల్పోతారని ఓ జనరల్‌ నాకు చెప్పారు. మానవరహిత డ్రోన్‌ కూల్చివేతకు ఇంత తీవ్ర ప్రతిచర్య తగదన్న ఉద్దేశంతో దాడిని ఆపించా. నేనేమీ హడావుడి పడటంలేదు. మా సైన్యం పునరుత్తేజం పొంది ఉంది. దాడికి సర్వ సన్నద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను పెంచుతున్నట్లు తెలిపారు.
‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం.. ఇరాన్‌లోని మూడు ప్రదేశాలపై దాడికి వ్యూహరచన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల సమయంలో నిర్దేశిత లక్ష్యాలపై దాడులు జరుగుతాయని అమెరికా సైనిక, దౌత్య వర్గాలు భావించాయి. ఇరాన్‌కు చెందిన రాడార్‌ కేంద్రాలు, క్షిపణి విభాగాలపై పరిమిత స్థాయిలో విరుచుకుపడాలనుకున్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘‘యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. యుద్ధనౌకలు నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నాయి. ఇంతలోకి ‘ఆపేయండి’ అంటూ ఆదేశాలు రావడంతో క్షిపణి ప్రయోగాలు జరగలేదు.’’ అని ఆ అధికారి తెలిపారు.

చమురు ట్యాంకర్లకు భారత నౌకాదళ రక్షణ
అమెరికా, ఇరాన్‌ మధ్య సైనిక ఘర్షణకు అవకాశమున్న నేపథ్యంలో పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతం గుండా ప్రయాణించే భారత చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించాలని మన నౌకాదళం నిర్ణయించింది. ఈ మేరకు ఆ నౌకల్లో నేవీ అధికారులు, సిబ్బంది మోహరిస్తారు.

ఉల్లంఘనపై ఆధారాలు: ఇరాన్‌

అమెరికా డ్రోన్‌ తమ గగనతలాన్ని ఉల్లంఘించినట్లు తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఇరాన్‌ శుక్రవారం ప్రకటించింది. ఆ లోహ విహంగంపైకి క్షిపణిని ప్రయోగించడానికి ముందు పదేపదే హెచ్చరికలు జారీ చేశామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ అధిపతి జనరల్‌ అమిర్‌ అలీ హాజీజాదే పేర్కొన్నారు. తమ సరిహద్దులను ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటామని ఇరాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

విమాన సర్వీసులపై ప్రభావం

తాజా ఉద్రిక్తతల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ఈ క్రమంలో హోర్ముజ్‌ జలసంధి మీదుగా వెళ్లే విమానాలను శుక్రవారం పలు విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఇందులో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, క్వాంటాస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వంటివి ఉన్నాయి. అమెరికాలో రిజిస్టరైన విమానాలు పర్షియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ మీదుగా కార్యకలాపాలు సాగించడాన్ని నిషేధిస్తూ అమెరికా ఎఫ్‌ఏఏ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, డచ్‌ సంస్థ కేఎల్‌ఎం కూడా ఇదే తరహా నిర్ణయాల్ని తీసుకున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ న్యూయార్క్‌ నుంచి ముంబయికి విమాన సర్వీసులను రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.