గ్రామీణాభివృద్ధి పథకాలు

Rural development programs

గ్రామీణాభివృద్ధి పథకాలు

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధులను నెరవేర్చడానికి కేంద్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖను 2004, మే 27న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నది.

రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన (ఆర్జీఎస్‌వై):
-రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో సామర్థ్య పెంపుదల, శిక్షణా కార్యక్రమాలకోసం దీన్ని ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రజలకు లబ్ధిచేకూర్చే ఈ పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. వెనుకబడిన ప్రాంతాల మంజూరి నిధి (బీఆర్‌జీఎఫ్) పథకం అమలుకాని జిల్లాల్లో దీన్ని అమలుచేస్తారు.

పంచాయత్ మహిళ ఏవం యువశక్తి అభియాన్:
-పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా 2008లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-ఈ పథకం ద్వారా మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను సమర్థవంతంగా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తారు. వారి సాధికారత కోసం వ్యవస్థాగతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, వారి అభివృద్ధిలో ప్రధాన విధానాలు, వాటి ప్రాముఖ్యతను సమీకృతం చేస్తారు.

గ్రామీణ వ్యాపార కేంద్రం (ఆర్‌బీహెచ్):
-గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధిచేసి శీఘ్రగతిన గ్రామీణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రూరల్ బిజినెస్ హబ్స్ పథకాన్ని 2007లో ప్రారంభించారు.
-గ్రామీణ ప్రజలు లబ్ధిపొందే ఈ పథకం ద్వారా మొదట జాతీయంగా లేదా అంతర్జాతీయంగా మార్కెట్లలో నాణ్యతగా కావలసిన ఏ వస్తువును గ్రామం నుంచి ఉత్పత్తి చేయవచ్చో గుర్తిస్తారు. తద్వారా గ్రామీణ ఉత్పత్తులను పెంచి మార్కెట్లకు తరలిస్తారు.
-స్థానికంగా ఉన్న రూరల్ నాన్ ఫార్మింగ్ ఎంటర్‌ప్రైజెస్‌లను అభివృద్ధిపరిచి గ్రామీణ ఉద్యోగిత అధికమయ్యేలా చూస్తారు.
-ఈ పథకంద్వారా ఉత్పత్తిదారులకు, పారిశ్రామికులకు ఇద్దరికీ లబ్ధిచేకూరేలా కార్యక్రమాలను రూపొందిస్తారు.

పంచాయతీ వ్యవస్థలో జవాబుదారీతనం, సాధికారతకు ప్రోత్సాహకాల పథకం:
-పంచాయతీ వ్యవస్థలకు అధికారాలను బదలాయించి వాటిని బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని 2005-06లో ప్రవేశపెట్టారు.
-ప్రకరణ 243జీ ప్రకారం 11వ షెడ్యూల్‌లోని 29 విధులను గ్రామపంచాయతీలకు బదలాయించడం, విధులు, నిధులు, సిబ్బంది సమస్యలను అధిగమించడం, పంచాయతీ వ్యవస్థల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించి సమర్థవంతంగా పనిచేసేలా ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

గిరిజనప్రాంతాల్లో స్థానిక సంస్థలు (పీఈఎస్‌ఏ):
-షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ చట్టాన్ని విస్తరించడం కోసం పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ (పీఈఎస్‌ఏ) ఈ చట్టాన్ని 1996, డిసెంబర్ 24న తీసుకొచ్చారు. దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫారసుల ఆధారంగా దీన్ని రూపొందించారు.
-స్థానిక గిరిజన సాంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామ సభకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
-ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలోని 9వ భాగంలో ఉన్న విషయాలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరింపచేస్తారు.
ఈ-గవర్నెన్స్
-సమాచారాన్ని పౌరులకు చేరవేయడం కోసం, ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములను చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికను ప్రారంభించింది.
-ప్రభుత్వ సేవలను ప్రజలకు స్థానికంగా అందేలా చూడటమే కాకుండా, పారదర్శకతతో ఆ సేవలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం.
-దీనిద్వారా పంచాయతీల అంతర్గత పనుల విధానాలను ఆటోమేటిక్ చేయడం, పౌరులకు అందించే సేవలను అభివృద్ధిపర్చడం, పంచాయతీ అధికారుల సామర్థ్యం పెంచడం, స్థానిక ప్రభుత్వాల పరిపాలనను అభివృద్ధిపర్చవచ్చు.

భారత్ నిర్మాణ్:
-గ్రామాలకు, పట్టణాలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి, 1000 మందికిపైగా జనాభా ఉన్న గ్రామాల్లో సాగు, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, రహదారులు మొదలైన వసతులను కల్పించడంకోసం 2005, డిసెంబర్ 16న ఈ పథకాన్ని ప్రారంభించారు.
-గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులకోసం కూలీలు వలసలు పోకుండా తగ్గించడంలో ఇది ప్రధానపాత్రపోషిస్తుంది.

రాజీవ్‌గాంధీ పంచాయతీ సశక్తీకరణ్ అభియాన్:
-పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడంకోసం 2009లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కింద అమలవుతున్న ఆరు పథకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి నుంచి అభివృద్ధి గ్రాంటు భాగం, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌యోజన, ఈ-పంచాయతీ, పంచాయత్ ఎంపవర్‌మెంట్ అండ్ అకౌంటబిలిటీ ఇన్సెంటివ్ స్కీమ్, పంచాయత్ మహిళా ఏవం యువశక్తి అభియాన్, బీఆర్‌జీఎఫ్‌లోని రూరల్ బిజినెస్ హబ్ పథకాలను ఇందులో విలీనం చేశారు.
-ఈ పథకం ద్వారా సామర్థ్య నిర్మాణం, విజ్ఞాన సృష్టి కోసం సమగ్రమైన అంశాలను బలోపేతం చేస్తారు.
-నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేంవర్క్ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు ఎంపికైన ప్రజాప్రతినిధులకు, అందులో పనిచేసే సిబ్బందికి తగిన శిక్షణ అందిస్తారు.
-గ్రామసభకు అవసరమైన సహాయసహకారాలు అందించి ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయాలు తీసుకునేలా, జవాబుదారీతనాన్ని పెంపొందించేలా చేయడం, పీఈఎస్‌ఏ ప్రాంతాల్లో గ్రామసభలను సమీకరించేందుకు ఒక వ్యక్తిని, బ్లాకు స్థాయిలో పెసా లేదా గ్రామసభ అధికారి, జిల్లా స్థాయిలో పెసా గ్రామసభ కోఆర్డినేటర్‌ను నియమిస్తారు.
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్‌డీ, ప్రణాళికా సంఘం నిబంధనల ప్రకారం తయారుచేయాల్సిన వికేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వ్యవస్థీకృతం చేస్తారు.
-సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకున్న పంచాయతీలకు ప్రోత్సాహాన్ని అందిస్తారు.
-ఈ పథాకానికి అవసరమైన సలహాలు, సూచనలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రుల అధ్యక్షుడిగా ఏర్పాటుచేసి సెంట్రల్ స్టీరింగ్ కమిటీ చేస్తుంది. దీంతోపాటు పథకం అమలును పర్యవేక్షిస్తుంది.

సెర్ప్
-పేదరిక నిర్మూలనా కార్యక్రమాలను అమలు చేయడం, వాటిని పర్యవేక్షించడానికి 2000లో గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంఘం (సెర్ప్) పథకాన్ని ప్రవేశపెట్టారు.
-కమ్యూనిటీ ఆధార సంస్థలను పటిష్టం చేయడానికి సెర్ప్ కృషి చేస్తుంది.
-గ్రామ సభల ద్వారా భాగస్వామ్య అవసరాల గుర్తింపు పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల అమలులో సామర్థ్యాల నిర్మాణ సంఘాలను ఏర్పాటుచేసి వాటిద్వారా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ సంఘాలు, మహిళా సమాఖ్యలను బలోపేతం చేస్తుంది.